గత 8 రోజుల నుంచి బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయిన ఆడబిడ్డలు ఇవాళ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను వైభవంగా జరుపుకోనున్నారు. హైదరాబాదుతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు ఈరోజు తంగేడు, గునుగు వంటి పూలతో బతుకమ్మను అందంగా పేర్చి సాయంకాలం వేళ గౌరీదేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు. ఊరేగింపుగా వెళ్లి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.
ఈ తరుణంలోనే..తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ‘బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం. రాష్ట్ర ప్రజల జీవన విధానం నుంచి పుట్టినదే బతుకమ్మ పండుగ. పువ్వులే బతుకమ్మగా పూజలు అందుకోవటాన్ని చూస్తుంటే తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞత భావన తెలుస్తోంది. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలి. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలి’ అని కేసిఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.