కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాట మంట పెడుతోంది. ఏకంగా కొన్ని ప్రాంతాల్లో కిలో టమాట రూ.100 ధర పలుకుతోంది. సామాన్యులు కూరగాయలు కొనాలంటే జంకుతున్నారు. ప్రతి కూరలో అత్యవసరమైన టమాట అధిక ధర పలుకుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్లలో కిలో టమాట ధర రూ.100 పలుకుతోంది. కొన్ని మార్కెట్లలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది.
గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. దిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థా్న్‌లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి. పంజాబ్ లో రూ.60-80 మధ్య లభిస్తున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రూ.60 నుంచి రూ.80.. మరి కొన్ని ప్రాంతాల్లో రూ.100 వరకు ధర పలుకుతోంది.