లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచిన బీజేపీ.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం సున్నా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ బీజేపీ ఎంపీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారని.. వారు విభజన చట్టంలోని హామీల గురించి ఏనాడైనా మాట్లాడారా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రోకు నిధులు అడిగినా ఇవ్వకపోవడంతో అది తొమ్మిదో స్థానానికి పడిపోయిందని తెలిపారు. మూసీ పునరుజ్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదని దుయ్యబట్టారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి వారు ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతితల్లి ప్రేమ అని వ్యాఖ్యానించారు.