సీబీఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటుందని.. కేవలం ప్రతిపక్షాల పై అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసు లో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జీ షీట్ లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేస్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలకు మద్దతుగా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు అవుతుందని.. అప్పటి నుంచి దాదాపు 95 శాతం ఈడీ కేసులు అన్నీ ప్రతిపక్షాల పైనే పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు నమోదైన ప్రతీ 100 కేసుల్లో 95 కేసులు ప్రతిపక్షాలపైనే ఉంటున్నాయని ప్రతిపక్షాల పేర్లు లేకుండా ఈడీ చార్జీ షీట్లు దాఖలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.