వికారాబాద్ కలెక్టర్ లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కలెక్టర్ సహా అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు..? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు..? ఇప్పుడీ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్‌పై దాడి కచ్చితంగా కుట్రేనంటోంది పోలీసు యంత్రాంగం. అంతా ప్రీప్లాన్డ్‌గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ ఫిలింనగర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి ఆయనను వికారాబాద్ కి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు మూడు గంటలకు పైగా విచారణ చేపట్టారు పోలీసులు. వికారాబాద్ లో కొందరూ నిరసనలు చేపట్టడంతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రహించి పోలీసులు పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ విచారించిన అనంతరం వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరచనున్నట్టు సమాచారం.