కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెల్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి చేయడం పై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ పై దాడి అమానుషమన్నారు. కలెక్టర్ పై దాడి ఘటన పై కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వాళ్లు ఎంతటి వాళ్లైనా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. దాడికి ప్రోత్సహించిన బీఆర్ఎస్ నాయకులను, పాల్గొన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడులకు పాల్పడిన వాళ్లందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముఖ్యంగా అధికారంలో కోల్పోవడంతో ఫ్రస్టేషన్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారని.. దాడికి పాల్పడిన నేతలు కేటీఆర్ తో కూడా ఫోన్ లో టచ్ లో ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా స్వామ్య పద్దతిలో నిరసనలు చేయవచ్చు.. కానీ కలెక్టర్ పై దాడులకు పాల్పడటం సరైన పద్దతి కాదని సూచించారు.