తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 20న ఉపఎన్నిక జరుగనుంది. ఈనెల 12 ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి రాజ్య సభ స్థానానికి ఆశావహుల లిస్ట్ బాగానే ఉంది. బండ ప్రకాష్ రాజీనామా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఖాళీ అయిన ఈ స్థానం కోసం చాలా మంది టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. దీనికి తోడు మరోవైపు మరో ఇద్దరు తెరాస రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌ల పదవీకాలం వచ్చే నెల 22 వరకు ఉంది. ఈ గడువుకు 25 రోజుల ముందే నెలాఖరుకు ఈ రెండు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడనుంది.
ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయిన పల్లి వినోద్ కుమార్ పదవిని ఆశిస్తున్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటం… జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండటం వినోద్ కు కలిసి వచ్చే అంశం. వీరితో పాటు నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్‌రావు పరిశీలించే అవకాశం ఉంది. వీరితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎంపీలు సీతారాంనాయక్, బూర నర్సయ్య గౌడ్, టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఒక వేళ తాజా రాజ్యసభ స్థానానికి అవకాశం లభించకున్నా… త్వరలో ఖాళీ అవబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో అవకాశం వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు.