తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ రాగానే హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లోకి తీసుకురానుంది. రేపటి నుంచే ఈ హామీ అమల్లోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీపై భారీగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.
మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏయే బస్సుల్లో అమలుచేయాలనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ నిత్యం 12-13 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల్ని నడుపుతోందని.. సగటున రోజుకు రూ.14 కోట్ల రాబడి వస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది (12-13 లక్షల మంది) మహిళలు ఉంటుండగా.. ఉచిత ప్రయాణ పథకం అమలుతో రోజుకు సుమారు రూ.నాలుగు కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.