పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనతో చర్చలు జరిపి వేరే పదవి ఏదైనా ఇస్తారని ఆశించినా.. అక్కడా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీరుపై మండిపాటుకు గురైన తుమ్మల తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయణ్ను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించి తమ పార్టీలోకి ఆహ్వానించింది. కాంగ్రెస్ ఆహ్వానం అందుకున్న ఆయన హస్తం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా బీఆర్ఎస్ పార్టీరి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు సహకరించిన వారందరికి తుమ్మల ధన్యవాదాలు చెప్పారు. అలాగే తన నిర్ణయం ఏదైనా.. ఎల్లప్పుడూ తన వెంటనే ఉన్న అనుచరులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈయన ఇవాళ సాయంత్రం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అనంతరం సీడబ్ల్యూసీ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవనున్నారు.