లంచం తీసుకున్న ఇద్దరు జీఎస్టీ అధికారులు.. పది నెలల తర్వాత కేసు నమోదు చేసిన సీబీఐ

-

లంచం తీసుకున్న ఇద్దరు జీఎస్టీ అధికారులపై  ఫిర్యాదు చేసిన పది నెలల తర్వాత కేసు నమోదు చేసింది సీబీఐ.  మూసివేసిన పాత ఇనుప దుకాణాన్ని తిరిగి తెరిచేందుకు లంచం తీసుకోవడమే కాకుండా మరింత కావాలని డిమాండ్ చేసారు  జీఎస్టీ అధికారులు. పన్నుల చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని.. జరిమానా విధించకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలని జీఎస్టీ సూపరింటెండెంట్ వి.డి. ఆనందకుమార్, ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ అడిగారని గ్రేడ్ వన్ ఐరన్ స్క్రాప్ మర్చంట్స్‌కు చెందిన సయ్యద్ ఫిరోజ్ 2023, అక్టోబరు 4న ఫిర్యాదుచేశారు.

అంతకు మూడు నెలల ముందు జులై 4వ తేదీన వారు తమ దుకాణంలో సోదాలు నిర్వహించి జప్తు చేశారని, రూ.25 లక్షలు జరిమానా విధిస్తామన్నారని పేర్కొన్నారు. రూ.10 లక్షలు లంచం ఇస్తే జరిమానా రద్దు చేస్తామని కూడా చెప్పారని, తాను బతిమాలడంతో చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నారని ఫిరోజ్ తెలిపారు. ఈ డబ్బును అదే రోజు సాయంత్రం ఒక హోటల్లో అందజేశానన్నారు. ఆ తర్వాత మరో రూ.3 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఫిరోజ్ పేర్కొన్నారు. అదనపు లంచం ఇచ్చేందుకు తాము నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్నారు. దీనిపై జీఎస్టీ అధికారులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో తనను అరెస్టు చేశారని ఫిరోజ్ పేర్కొన్నారు. ఈ విషయాలను వివరిస్తూ 2023 అక్టోబరు 4వ తేదీన ఫిరోజ్ సీబీఐ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఫిరోజ్ ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఇద్దరు జీఎస్టీ అధికారులు ఆనంద్ కుమార్, మనీష్ శర్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version