ప్రకృతి అతిథిగా వస్తున్నప్పుడు మనమందరం తలవంచి ఆహ్వానించడం తప్ప ఏం చేయలేం. ఎంత ఆధునిక పరిజ్ఞానం ఉన్నా.. టెక్నాలజీతో మనం ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. మన జీవితాన్ని టెక్నాలజీ సాయంతో ఎంత ఈజీగా మలుచుకున్నా.. ప్రకృతి ప్రకోపం సంభవించినప్పుడు అదంతా ఆ కోపానికి బలికావాల్సిందే. ప్రకృతి ప్రళయంలో కొట్టుకుపోవాల్సిందే. కొన్నిరోజుల క్రితం కాళేశ్వరం లక్ష్మీపంపుహౌజ్ విషయంలో జరిగింది ఇదే.
ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. మీరు రోజూ తినేదానికంటే కాస్త ఎక్కువ లాగించారనుకోండి. మీ పొట్ట కాస్త ఇబ్బందిగా మారి తిన్నది బయటకు వస్తుంది కదా. అలాగే డ్యామ్ కూడా. తన సామర్థ్యానికి మించి వరద చేరినప్పుడు సమస్యలు వస్తాయి. 100 ఏళ్లైనా చెక్కుచెదరదని సర్టిఫైడ్ చేసిన డ్యామ్ అయినా.. ప్రకృతి విలయానికి తలవంచాల్సిందే. ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అత్యంత భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో ముఖ్యమైన పంపుహౌజ్ లక్ష్మీపంపు హౌజ్. మేడిగడ్డ బ్యారేజీ 13 లక్షల క్యూసెక్కులను తట్టుకోగలుగుతుంది. డేటా విశ్లేషణ ప్రకారం లక్ష్మీపంపు హౌజ్ సామర్థ్యం 106 ఎంస్ఎస్ఎల్ మాత్రమే కానీ భవిష్యత్‌లో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి దాన్ని 111 ఎంఎస్ఎల్ వద్ద నిర్మించారు. అయినా అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదకు మునిగిపోయింది.
భారీ వర్షాల వల్ల గోదావరికి 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా మేడిగడ్డ తట్టుకుని నిలబడింది. ఆ బ్యారేజీ 85 గేట్లు పటిష్ఠంగా పనిచేశాయి. కానీ లక్ష్మీ పంపుహౌజ్ మునిగిపోవడానికి మాత్రం అంచనా వేయని.. అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి ప్రళయమే కారణం. మన చేతుల్లో లేని దాని గురించి విమర్శలు చేయడం చాలా ఈజీ. కానీ ఒకసారి చరిత్ర తిరగేసి చూసుకుంటే.. ఇలా అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల, ప్రకృతి సృష్టించిన విలయం వల్ల నీటిలో మునిగిపోయిన ప్రాజెక్టులెన్నో ఉన్నాయి. లక్ష్మీ పంపుహౌజ్ మొదటిదేం కాదు. ఫీనిక్స్ లాగా ఈ ప్రాజెక్టు కూడ త్వరలోనే పునరుద్ధరణ జరిగి మరింత స్ట్రాంగ్‌గా తయారవుతుంది.