రాష్ట్రంలో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రజలను తమవైపు ఆకర్షించేలా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. మరికొన్ని పార్టీలేమో తమ క్యాడర్‌ను బలపర్చుకునే అంశంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ భారీ చేరికల ఆపరేషన్ షురూ చేసింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పాటు ఘర్ వాపసీ కూడా చేపట్టింది.
అయితే ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకుంటే.. మరోవైపు ఆ పార్టీ కీలక నేత.. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ను తాను వీడుతున్నట్లు వస్తున్న కథనాలను తీవ్రంగా ఖండించారు. ఎవరో కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టంచేశారు. దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలోనూ తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకు రావడానికి తన వంతు కృషి చేస్తానని ఉత్తమ్ తేల్చి చెప్పారు.