ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. TGSDCL ఛైర్మన్‌గా అన్వేష్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్..అనంతరం మాట్లాడారు. రైతులకు సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తుందని వెల్లడించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
రైతులను అప్పుల బాధ నుంచి విముక్తం చేసేందుకు ఒకే దఫాలో పంట రుణాలను మాఫీ చేసేందుకు కట్టుబడి ఉంది..పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. రైతుల ఆర్థిక సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించామని, ఇది రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి మద్దతునిస్తుందని వివరించారు.
ఆయకట్టును పెంచేందుకు కనీస పెట్టుబడితో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ఉత్తమ్ కుమార్‌రెడ్డి. బీఆర్‌ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్, పేరుమార్చి ప్రజాధనాన్ని వృథా చేశారు. వాటి వల్ల రైతులకు ఎలాంటి మేలు జరగలేదని ఆగ్రహించారు.