నేడు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఇందిరా గాంధీ పేదలకు ఇచ్చిన భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటివరకు ఏం చేయలేదని అన్నారు.
వచ్చే ఎన్నికలలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతి పార్లమెంటులో బీసీలకు మూడు సీట్లు కేటాయించాలని కోరారు. రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రతి జిల్లాకు తీసుకువెళతామన్నారు. ఇక త్వరలోనే బీసీ గర్జన సభ నిర్వహిస్తామని.. ఆ బీసీ గర్జన సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆహ్వానిస్తామని తెలిపారు. తెలంగాణలో బిజెపి పని ఖతం అయిందని.. తెలంగాణలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు.