ప్రయాణికుల సౌలభ్యం కోసం.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ రైళ్లు ఆగస్టు 15వ తేదీన ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇక కొత్తగా నడుపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 బోగీలతో రాత్రి నడపనుండగా.. ఇవి ఏసీ, నాన్‌ఏసీ కోచ్‌లు కావడంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.