మరోసారి కూలిన ఓడేడ్‌ వంతెన గడ్డర్లు

-

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై నిర్మిస్తున్న వంతెన విషయంలో నాణ్యత లోపం మరోసారి బయటపడింది. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన గతంలో గాలికి కూలిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

మంగళవారం రోజున సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయి. ఈ ఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పెద్దపల్లి జిల్లా ఆర్‌అండ్‌బీ ఇన్‌ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పరిశీలించి గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపారు. ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు.

2016లో రూ.47 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించగా.. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి. తాజాగా ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news