చంద్రబాబు అరెస్టులో బీజేపీ ప్రమేయం లేదని పేర్కొన్నారు బిజేపి నేత విజయశాంతి. చంద్రబాబు అరెస్టు విషయంలో బిజెపి ప్రమేయం ఉందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేత విజయశాంతి ట్విట్టర్ లో ఖండించారు. ఆ అరెస్ట్ విధానం తప్పు అని ఎంపీ లక్ష్మణ్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు.
ఏపీలోను తమ పార్టీ ఉంటుందన్న బిఆర్ఎస్…. చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదని విమర్శించారు. తాము అలా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే జాతీయ పార్టీ, లేదంటే తెలంగాణ పార్టీ అనే బిఆర్ఎస్ అవకాశవాద ధోరణిలో బిజెపి ఎన్నడూ ప్రవర్తించదన్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అంశాలపై జర్నలిస్టులు మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించగా… ఆయన స్పందించలేదు. ‘పక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాకు ఎలాంటి సంబంధం లేదు. అది వారి తలనొప్పి. మాకు సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 కి పైగా స్థానాల్లో గెలిచి, మరోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.