అమిత్ షాపై విజయశాంతి విమర్శలు చేశారు. దశాబ్దాల నాటి భైరాన్‌పల్లి సంస్మరణదినం, ఆ తర్వాత, ప్రతి మండలం, పల్లెలల్ల స్మారకాలు.. ఈ అంశాలన్నిటి పట్ల ఇప్పటి ప్రజలకు ఏ భావోద్వేగం ఉండాలనే ప్రయత్నం మీది? అమిత్ షా గారూ? అని నిలదీశారు. ఎప్పుడో నాటి సమాజం ఉన్న పరిస్థితులు, విద్య, ఉద్యోగం లేని జీవన ప్రమాణాలు, బతుకుతెరువు, ఆధిపత్య సంస్కృతి వేరు..ఇయ్యాల్టి సమాజం, ప్రపంచం వేరంటూ నిప్పులు చెరిగారు రాములమ్మ.
సమకాలీన సమాజ అసమానతలు, మత విశ్వాసాల ఆధారంగా ఏర్పడుతూ, ఏర్పరుస్తూ వస్తున్న విభేదాలను సముదాయించి, సమన్వయం చెయ్యటం ద్వారా బాధ్యత కలిగిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి దారి చూపగలదు గానీ, దశాబ్దాల.. పురాతన సంఘటనలను తిరిగి జనహృదయంలోకి తేవడమనే చర్య, ఎన్నికల అవసరార్ధం చేసే ప్రయత్నమే అయితదన్నారు.
బీఆరెస్ అవినీతిపై బీజేపీ కేంద్ర ప్రభుత్వ చర్యల కోసం ఎదురుచూసిన తెలంగాణ ప్రజలు, కేసీఆర్ గారి మాటలపై మీరు నడవకుంటే.. ఇయ్యాల ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని విడిచిపెట్టిన్రు?.. అని అడుగుతున్నారని పేర్కొన్నారు. అది విడిచి, మీపై మేనిఫెస్టోల మీరే చెప్పినట్లు ఇట్ల చేసి, తెలంగాణల మతవిద్వేషాలు రెచ్చగొడుతూ.. ఆ విద్వేషాల విధానంపైనే నడిచే ఎంఐఎంను, అన్నిచోట్లకు తెచ్చి, ప్రశాంతమైన పల్లెల నెత్తిన కొట్లాటల కుంపటి తెస్తారా అమిత్ షా గారూ…తెలంగాణ సమాజం చైతన్యవంతమైనది.ఇది సమంజసం కాదు.. బహుశా, ఎప్పటికి అంటూ ట్వీట్ చేశారు విజయశాంతి.