ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం అయింది. శ్రీ దశవిద్యా మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. గంగమ్మ ఒడిలో చేరేందుకు మహాగణపయ్య శోభాయాత్రగా తరలివస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణపయ్య శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలందుకుంటున్న లంబోదరుడు ఇవాళ గంగమ్మ వద్దకు చేరేందుకు పయనమయ్యాడు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా….
బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ వరకు సాగే ప్రధాన శోభాయాత్ర తో పాటు ఊరేగింపు జరిగే దారులలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు అనుమతి లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కేశవ గిరి, మహబూబ్నగర్ చౌరస్తా, అశ్రా హాస్పిటల్, సిటీ కాలేజీ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది. చంచల్గూడా జైలు చౌరస్తా, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్గంజ్ మరియు కోటి ఆంధ్ర బ్యాంకు వద్ద వాహనాలు మళ్లించనున్నారు. మెహదీపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను మసాబ్ ట్యాంకు వద్ద, కూకట్పల్లి బస్సులను ఖైరతాబాద్, సికింద్రాబాద్ బస్సులను సిటీవో, ప్లాజా మరియు ఎస్బిహెచ్, క్లాక్ టవర్ వద్ద నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ట్యాంకుబండు వద్ద ఇలాంటి వాహనాలు తిరగడానికి వీలు లేదు.