తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. మరో 15 రోజుల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే.. ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా వారి పోలింగ్ కేంద్రం, బూత్‌ల వివరాలతో కూడిన చీటీల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయనున్నారు.
నేటి నుంచి వారం రోజుల పాటు ఓటరు స్లిప్పుల పంపిణీ జరగనుంది. చీటీలు అందనివారు బీఎల్‌వోను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచించారు. శేరిలింగంపల్లి పరిధిలో ఎక్కువమంది ఓటర్లున్న దృష్ట్యా మంగళవారం నుంచే ఓటరు పంపిణీ మొదలుపెట్టారు. అక్కడ ఈనెల 23 వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఏకకాలంలో ఓటరు చీటీల పంపిణీ కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మాత్రం ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. బూత్‌స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయగా.. ఈ కార్యక్రమాన్ని నోడల్ అధికారులు సమీక్షించనున్నారు.