బీటెక్ రవిని చూడాలంటే జగన్ వణికిపోతున్నాడని చురకలు అంటించారు టీడీపీ నేత నారా లోకేష్. మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టిడిపి ఇన్చార్జి బీటెక్ రవి అరెస్టు అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కడప మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరచగా… న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను కడప జైలుకు తరలించారు. గతంలో లోకేష్ కడప పర్యటన సమయంలో ఏయిర్ పోర్టు వద్ద జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్టు చేసినట్టు డిఎస్పి షరీఫ్ తెలిపారు. ఆరోజు తమ ఏఎస్ఐకి గాయాలు అయ్యాయని చెప్పారు.
అయితే..ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు. పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్లాల్సి వచ్చినా జగన్ రెడ్డి గజగజా వణుకుతున్నాడని చురకలు అంటించారు. పరదాలు, బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, దుకాణాల మూసివేత, చెట్ల నరికివేత ఇన్ని చేసినా ఓట్లేసిన జనంని చూడాలంటే జగన్ రెడ్డికి భయం అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పంద జగన్. తన ఎన్నికల ప్రత్యర్థి, టిడిపి ఇన్చార్జి బీటెక్ రవిని చూసినా భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయ కక్షసాధింపుకి పోలీసుల్ని పార్టీ కార్యకర్తల్లా వాడు కుంటున్నాడు. రవి అక్రమ అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయనకి ఏం జరిగినా జగన్, పోలీసులదే బాధ్యత అంటూ మండిపడ్డారు.