గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతోపాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీఆర్‌ఏ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి థ్యాంక్స్ చెప్పారు. అయితే సీఎంకు కృతజ్ఞతలు తెలపడంలో మరో ముందడుగేస్తున్నారు వీఆర్‌ఏ సంఘం నేతలు.
ఇందులో భాగంగానే.. త్వరలో కృతజ్ఞత సభ నిర్వహించనున్నట్లు వీఆర్‌ఏ సంఘం నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 61 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల వారసులకు ఉద్యోగాలు, 2014 జూన్ తరువాత మరణించిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు తదితర సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. సీఎం సభ అనంతరం వీఆర్‌ఏ ఐకాస రద్దుపరిచే నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు రమేష్ బహదూర్, రాజయ్య, సాయన్న, గోవింద్ తదితరులు తెలిపారు.
మరోవైపు.. రాష్ట్రంలోని 5073 మంది వీఆర్‌ఏలను నీటి పారుదల శాఖలో సర్దుబాటు చేయనున్నారు. వారిలో 3905 మందిని లస్కర్లుగా, 1168 మందిని సహాయకుల పోస్టులో సర్దుబాటు చేస్తారు.