RMP వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గం – బండి సంజయ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నేడు హైదరాబాదులో ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎంపీ వ్యవస్థని ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఇచ్చిన మాట తప్పి ఆర్ఎంపి, పీఎంపీ లపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకునేలా చేస్తామని వాళ్లకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చిందని ఆరోపించారు. ఆర్ఎంపి, పీఎంపీ వ్యవస్థలే లేకుంటే ప్రజల ప్రాణాలు కాపాడేది ఎవరని మండిపడ్డారు. “రాష్ట్రంలో ప్రజలకు విస్త్రతంగా వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీలపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఇంజక్షన్ వేయకూడదని, సెలైన్ ఎక్కించకూడదని, రిజిస్ట్రేషన్ లేదనే సాకుతో ప్రజలకు వైద్యం అందించకుండా ఏకంగా ఆ వ్యవస్థే లేకుండా ధ్వంసం చేయాలనుకోవడం దుర్మార్గం.

ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారు. టీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆనాడు ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఏకంగా ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థనే లేకుండా చేయాలనుకోవడం సిగ్గు చేటు.

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. డాక్టర్ల భర్తీ లేదు. మందుల్లేవు. పరీక్షలు చేసే నాథుడే లేడు. 104 సేవలను పూర్తిగా నిలిపేశారు. ఎమర్జెన్సీ సేవలందించే 108 అంబులెన్సులకు డీజిల్ కూడా పోయించలేని దుస్థితిలోకి నెట్టేశారు.

ఈ నేపథ్యంలో గ్రామాల్లో, బస్తీల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ అత్యంత తక్కువ ఖర్చుతో ప్రాథమిక వైద్య సేవలందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతోంది ఆర్ఎంపీ, పీఎంపీలే. ఆ వ్యవస్థనే లేకుండా చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడేదెవరు? ఊరికో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించగలరా? నియోజకవర్గానికో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని మాట తప్పిన సీఎం కేసీఆర్ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారు.

ఆర్ఎంపీ, పీఎంపీల్లో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థనే లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గపు చర్య. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ఎంపీల విషయంలో జోక్యం చేసుకోవాలి.

చిన్నపాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా సరిగా చేయలేక ఇబ్రహీంపట్నంలో 4గురు మహిళల మ్రుతి చెందితే కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్… అందుకు బాధ్యులైన వైద్యశాఖ డైరెక్టర్, వైద్యశాఖ మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటు. సీఎం కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వైద్యశాఖ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి. వైద్యశాఖ మంత్రిని బర్త్ రఫ్ చేయాలని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం”.

Read more RELATED
Recommended to you

Exit mobile version