తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుసటి క్షణం నుంచే పోలీసులు రాష్ట్రంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు షురూ చేశారు. ముఖ్యంగా జిల్లా, రాష్ట్రా సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ.. లెక్కా పత్రాల్లేని నగదు, బంగారం, మద్యాన్ని సీజ్ చేస్తున్నారు. మరోవైపు అనుమానంగా కనిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వాహనాలు కూడా వదలకుండా తనిఖీలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కారును వరంగల్ పోలీసులు తనిఖీ చేశారు. వరంగల్ నుంచి నర్సంపేట మీదుగా కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో నర్సంపేట చెక్ పోస్టు వద్ద ఆమె కారును పోలీసులు నిలిపివేశారు. కారు డిక్కీని తనిఖీ చేశారు. ఆరు గ్యారెంటీల కరపత్రాలు, గోడపత్రాలు తప్ప ఎలాంటి నగదు, వస్తువులు గాని లభ్యం కాకపోవడంతో పోలీసులు పంపించారు. అక్కడి నుంచి కొత్తగూడంలోని శ్రీరామలింగేశ్వర అలయనికి వెళ్లి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.