కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని లోయర్ మానేరు జలాశయాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. అధికారులను అడిగి నీటి సామర్థ్యం విలువలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తాగునీటి సమస్య, నీటి యుద్ధం మొదలైందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి నెలలో ఇంత డెడ్ స్టోరేజీకి ఎప్పుడు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో తాగునీటికి కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు పడటం తప్పదన్నారు.
కరీంనగర్ ఇన్ చార్జీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎల్లంకి కనీసం 13 టీఎంసీల నీరును పంపే ప్రభుత్వం చేయాలన్నారు. ఎల్ఎండీ నుంచి దిగువకు నీరు వెళ్తున్నది కానీ పై నుంచి ఎల్ఎండీకి నీరు రావడం లేదని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కడితే ఆ నీరు ఏమైనా కలుషితంగా మారినాయా అని ఆయన ప్రశ్నించారు. కేవలం కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు గంగుల కమలాకర్.