తెలంగాణ, ఏపీల మధ్య ఇంకా నీటి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఏపీ నీటిపారుదల ప్రాజెక్టులపై స్పందించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న నీటి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఏపీలోని కూటమి సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏకపక్షంగా వెళ్తోందని ఆయన మండిపడ్డారు. ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, బనకచర్ల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో సుప్రీకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి వెల్లడించారు. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేస్తామని చెప్పారు. ఏపీ చర్యల వల్ల తెలంగాణలో సాగునీరు, తాగునీటికి ముప్పు ఏర్పడే ప్రమాదముందని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.