త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనియాగాంధీకి తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచడాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
బస్సుల్లో ఇప్పటికే 14 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని ఆయన తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలెండర్ అందజేత, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని సోనియా గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తున్నామని సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.