పేద, మధ్య తరగతి ప్రజలకు బియ్యం ధరల నుంచి ఉపశమనం కలిగించేలా కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే భారత్ బ్రాండ్ పేరిట బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అలా కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు అందిస్తున్న భారత్ బియ్యం విక్రయాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.
‘భారత్ రైస్’ పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ఈ విక్రయాలను ప్రారంభిస్తారని అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్‌ను విక్రయిస్తారని వెల్లడించారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనున్నట్లు వివరించారు. భారత్ రైస్‌ను ఈ-కామర్స్ వేదికలపైనా కొనుగోలు చేయవచ్చని కేంద్రం చెప్పింది.