అధికారుల నిర్లక్ష్యం పై ప్రభుత్వానికి నివేదిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టపై ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అక్కడ ఉన్న పర్కి చెరువు కబ్జాలకు కూడా స్థానికులు కమిషనర్ కు చూపించారు. శ్రీవేంకటేశ్వర ఆలయంలో అర్చకులు సముదాయాలను, ఆలయ భూములను కమిషనర్ పరిశీలించారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. గోవిందరాజుల స్వామి ఆలయం కొలను, గుండం కబ్జా అవుతున్నట్టు పూజారి నరహరి వీడియోను కూడా చూసి ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. 2024జులైలో హైడ్రా ఏర్పాటు అయిందని.. అంతకు ముందు నిర్మించిన నివాసాల జోలికి హైడ్రా వెళ్లదని స్పష్టం చేశారు కమిషనర్ . కుల సంఘాల పేరిట ఆలయాల భూముల కబ్జాలకు చేసి సొంతానికి వాడుకోవడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. కుల సంఘాల పేరిట కబ్జా చేసి ప్లాట్లు చేసి అమ్ముకోవడాన్ని కూడా సీరియస్ గా తీసుకున్నారు.