జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో గుప్త నిధులు కలకలం రేపాయి. కొందరికి లంకెబిందెలు దొరికాయంటూ గత వారం రోజులుగా ప్రచారం జరుగుతున్నది. సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నది. పంపకాల్లో తేడా రావడంతోనే ఈ వ్యవహారం బయటకు పొక్కినట్లు తెలుస్తున్నది. ఏకంగా గ్రామ పంచాయతీ వద్దనే పంచాయితీ పెట్టినట్లు తెలుస్తున్నది. ఆ నోటా, ఈ నోటా ఈ విషయం స్థానిక అధికారులకు తెలియడం, వారు ఆరా తీయడం చూస్తే నిజంగా లంకెబిందెలు దొరికాయేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఈ నెల 21న (శనివారం)తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉపాధి వెళ్తున్నాడు. గ్రామ శివారులో అతడికి కొప్పెర రూపంలో ఉన్న లంకెబిందె కనిపించింది. దానిలో ఏముందోనని బయపడి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోవేసి వెళ్లిపోయాడు. అక్కడే ఉపాధి పనులు చేస్తున్న కొందరికి విషయం చెప్పాడు. అందరూ కలిసి అదే రాత్రి జంతుబలి ఇచ్చి దానిని తీసుకెళ్లినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. గురువారం తహసీల్దార్‌తోపాటు కొందరు అధికారులు జంతుబలి ఇచ్చిన ప్రదేశాన్ని పరిశీలించారు. విచారణ చేపట్టాలని తహసీల్దార్ స్థానిక ఎస్సైని ఆదేశించారు. దీంతో ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మండలకేంద్రానికి చెందిన ఐదుగురిని అదుపులోకి విచారించినట్లు సమాచారం. ఐదుగురి మధ్య పంపకాల్లోఓ సయోధ్య కుదరకపోవడం, గ్రామ పంచాయతీ వద్దే పంచాయితీ పెట్టడంతో ఈ విషయం బయటికి వచ్చినట్లు తెలుస్తున్నది. గతంలో కూడా గుప్త నిధుల కోసం ఇదే ప్రదేశంలో తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.