ఎస్ఎల్బీసీ సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ) చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో
మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని సీఎం రేవంత్ నిరూపించాలని అన్నారు. ఒక వేళ ఆయన చెప్పిందే నిజమని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ విషయంలో రేవంత్కు చిత్తశుద్ధి లేదని, ప్రమాదం జరిగి 10 రోజులు గడస్తున్నా.. గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టలేకపోయారని అన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలను త్వరలో జరగబోయే అసెంబ్లీ లో ఎండగడతామని తెలిపారు. మోకాలికి, బోడి గుండుకు ముడేసి మోసగించడం రేవంత్ అలవాటేనని.. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడం వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. తన సన్నిహిత మిత్రుడి కూతురు పెళ్లికి అబుదాబి వెళ్లిన మాట వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని సీఎంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.