తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక ముఖ్యంగా బిందెడు నీళ్ల కోసం వ్యవసాయ బావుల వద్దకు పరుగులు పెడుతున్నారు మహిళలు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బాసుతండా గ్రామ పంచాయతీకి కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పాటు తాగునీటి బావికి ఉన్న మోటర్ ఐదు రోజుల క్రితం కాలిపోవడంతో తండా ప్రజలు నీళ్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. ఎండాకాలం కావడంతో ఉదయమే వరి కోతలకు, ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి కనీసం మొఖం కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండడం లేదని చెబుతున్నారు. పశువులకు తాగునీరు లేక పొలాల వద్దకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండాకు చెందిన బానోత్ మోహన్ తన వరి పొలం కోసం వేసిన పైపు లైన్ నుంచి ప్లాస్టిక్ పైపుతో ఇంటి వద్ద ఉన్న సంపు నింపుకుంటుండగా, తండావాసులు అక్కడికి వచ్చి నీటి కోసం బారులు తీరుతున్నారు. దీంతో నీరు సరిపోక తన పొలం ఎండిపోతుందని మోహన్ వాపోతున్నాడు.