బతుకమ్మ పండుగకు కానుకగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోంది. కానీ కొన్నిచోట్ల మహిళలకు ఈ చీరల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలు నాణ్యంగా లేవని మండిపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆ చీరలను కాల్చేస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో మహిళలు.. బతుకమ్మ చీరలు నాణ్యంగా లేవని వాటికి నిప్పంటించారు.
బుధవారం రోజున రేషన్ కార్డు ఆధారంగా బతుకమ్మ చీరలు అందుకున్న సుమారు 20 మంది మహిళలు ఆ చీరలను చూసి కోపోద్రిక్తులయ్యారు. చీరలు కాస్త కూడా నాణ్యంగా లేవని మండిపడ్డారు. ఆగ్రహంతో అక్కడికక్కడే ఆ చీరలకు నిప్పంటించారు. పొలాలకు అడవి జంతువులు రాకుండా అడ్డుగా కట్టే చీరలకంటే తక్కువ నాణ్యంగా ఉన్నాయని మండిపడ్డారు.
మరోవైపువనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామంలో 765 మందికి బతుకమ్మ చీరలు ఇవ్వాలని నిర్ణయించారు. తొలి విడతగా 275 మందికి పంపిణీ చేసేందుకు బుధవారం గ్రామంలో సభ ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మహిళలకు చీరలు అందించారు. అయితే చీరలు బాగాలేవని దాదాపు 100 మంది అక్కడికక్కడే తిరస్కరించారు.