తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్నాయి ఎండలు. దీంతో ఏపీ, తెలంగాణకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు ఏపీలో నేడు 37 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
ఇక అటు ప్రస్తుత ఏప్రిల్, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ రెండు మాసాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణా ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం లలో 45 డిగ్రీలకు ఉష్టోగ్రతలు చేరుకుని తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా వేసవిలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలపై ప్రజలను పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.