ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆన్ లైన్ లో గేమ్స్ ఆడుతూ డబ్బు పెట్టి తిరిగి పొందలేక, బెట్టింగులకు పాల్పడి ఉన్నదంతా కోల్పోయి.. వాటిని చెల్లించేందుకు అప్పులు చేసి.. వాటిని కట్టలేక చివరకు చావే శరణమని చాలా మంది యువకుడు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసగా మారి డబ్బు కోల్పోయిన మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్ర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే జైచంద్ర మరణించాడు. అయితే అతడి టీషర్ట్ పై ఆన్లైన్ గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దంటూ రాసి ఉండటం గమనించిన పోలీసులు ఈ విషయంపై కుటుంబాన్ని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ వల్ల డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.