రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల 46 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవ్వవచ్చని వాతావరణ శాఖ పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత స్థాయిలు ఉంటాయని వారు అంటున్నారు.
మొన్నీ మధ్య వరకు చలికాలం పుణ్యమా అని గజ గజ వణకాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మండే ఎండలకు అల్లాడిపోతున్నాం. ఇంకా మార్చి నెల ముగియనే లేదు. అప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మధ్య నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మే నెల వస్తే.. ఎండలను తట్టుకోవడం మన వల్ల కాని పని. అయితే ఈ సారి వేసవిలో ఎండలు మరీ దంచి కొట్టనున్నాయట. గత ఏడాది కన్నా ఈ సారి ఎండలు మరీ ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ సారి ఎండాకాలంలో వడగాలులు ఎక్కువగా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 2016, 2017 లాగే ఈ సారి కూడా వడగాలులు, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2016లో 27 రోజుల పాటు వడగాలులు వీయగా, 2017లో 23 రోజుల పాటు వడగాలులు వీచాయి. కాగా 2018లో కేవలం 7 రోజుల పాటు మాత్రమే వడగాలులు వీచాయి. ఈ క్రమంలో 2016 సంవత్సరంలో మాదిరిగానే ఈ వేసవిలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరుగుతాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఫిబ్రవరి నెలలో చలికాలమే ఉంటుంది. కానీ ఈ సారి మాత్ర ఫిబ్రవరి నెలలో చలి తీవ్రత అంతగా లేదు. పైగా ఎండ పెరిగింది. ఈ క్రమంలోనే వేసవిలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల 46 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవ్వవచ్చని వాతావరణ శాఖ పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత స్థాయిలు ఉంటాయని వారు అంటున్నారు. కాగా ఏప్రిల్, మే నెలల్లో క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది..!