బ్యానర్: ఏజి.నాగేశ్వర్‌రెడ్డి ఎంటర్‌టైనర్
నటీనటులు: సందీప్‌కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్‌కుమార్, అయ్యప్ప శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, అన్నపూర్ణమ్మ, ప్రభాస్ శ్రీను తదితరులు
మ్యూజిక్: సాయి కార్తీక్
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
నిర్మాతలు: నాగభూషణ్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, శ్రీనివాస్ ఇందుమూరి
దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి
రిలీజ్ డేట్: 15 నవంబర్, 2019
సందీప్ కిషన్.. చాలా ఏళ్లుగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో.. భిన్నమైన కథలతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్‌కిషన్ హీరోగా తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమా తెరకెక్కింది. ఇది కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో సందీప్‌కిషన్‌కు జంటగా హన్సిక, మోత్వాని జంటగా నటించారు. అయితే, విడుదలకు ముందు ఈ సినిమా మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుందని సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. సందీప్ కిషన్ కెరీర్‌లోనే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు నవ్విచ్చిందో సమీక్షలో చూద్దాం.
Tenali Ramakrishna BABL review
కథేమిటంటే..
కర్నూలు ప్రాంతంలోని కొండారెడ్డి బురుజు దగ్గర హత్య జరుగుతుంది. అయితే.. ఈ కేసులో జనం మంచి కోరే.. ఇండస్ట్రీయలిస్టు వరలక్ష్మీ దేవి(వరలక్ష్మీ శరత్ కుమార్)ని ఇరికిస్తారు. అయితే, కోర్టులో ఉన్న పెండింగ్ సివిల్ కేసులను బయట తన తెలివి తేటలతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి డబ్బులు సంపాదిస్తుంటాడు యువ లాయర్ తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్). ఈ క్రమంలోనే వరలక్ష్మీ కేసు ఎదురవుతోంది. తెనాలి రామకృష్ణ వరలక్ష్మీ కేసును ఎలా డీల్ చేశారు? అసలు బురుజు వద్ద జరిగిన హత్య ఎవరిది..? ఎందుకు జరిగింది..? ఎవరు చేయించారు. వరలక్ష్మీ దేవిని ఎందుకు ఇరికించారు ? ఈ జర్నీలో లాయర్ రుక్మిణి (హన్సిక)తో అతడి ప్రేమాయణం ఎలా నడిచింది ? తదితర అంశాలన్ని కూడా తెరపైనే చూడాలి మరి.
విశ్లేషణ :
నిజానికి.. తెనాలి రామకృష్ణ సినిమా కామెడీ సినిమా అని జోరుగా ప్రచారం జరిగింది. విడుదలకు ముందు కూడా యూనిట్ అదే చెప్పింది. కానీ, ప్రేక్షకులు ఆశించినంత హాస్యం మాత్రం అందలేదని చెప్పొచ్చు. అయితే, మొదటి భాగం కొంతమేరకు మంచి కామెడీ, సందీప్ పాత్రకు తగ్గట్టుగా ఎలివేషన్ సీన్స్ తో పాటు హీరోయిన్ తో నడిచే కెమిస్ట్రీ, పాటలు.. కథ ఆసక్తికరంగానే సాగింది. స్క్రీన్ ప్లే, టైమింగ్ కామెడీ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా.. సందీప్ కిషన్ తన నటనతో బాగా ఆకట్టుకుంటాడు. కోర్టు బయట ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే సీన్లు బాగా వచ్చాయి. అయితే, రెండో భాగాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా తీర్చిదిద్దితే బాగుండు.
ఈ సినిమాలో సందీప్ కిషన్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటన హైలెట్‌గా నిలుస్తుంది. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక లాయర్ రుక్మిణి పాత్రలో హన్సిక ఆకట్టుకుంది. సప్తగిరి, ప్రభాస్ శ్రీను ల కామెడీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అదేవిధంగా సాయి కార్తీక్ సంగీతం సినిమాకు అదనపు బలంగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే.. దర్శకుడు తాను అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించడంలో విఫలం చెందారనే చెప్పొచ్చు. నిజానికి.. అటు పూర్తిస్థాయిలో కామెడీ పండించలేక.. ఇటు సీరియస్‌నెస్‌ను చూపించలేక.. తికమకపడ్డారు.
దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి రాసుకున్న కామెడీ సీన్స్ అన్నీ అవుట్ డేటెడ్ మరియు ఇప్పటికీ చాలా సినిమాల్లో చూసేసాం. కొన్ని సీన్స్ హిట్ సినిమాల్లో నుంచి తీసుకు వచ్చి మళ్లీ రిపీట్ చేశారు. ఇక చాలా సీన్స్ మనకు రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలలోని సీన్స్ ఎక్కువగా గుర్తుకు తెస్తాయి. సినిమాలో కీలకంగా ఉన్న ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కంటెంట్ స్క్రీన్ మీదకు వచ్చే సరికి డైల్యూట్ అయిపోయింది. చమ్మక్ చంద్ర తో చేసిన జబర్దస్త్ స్కిట్స్ వెగటు పుట్టించాయి.
అసలు కథలోనే సరైన బలం కనిపించడం లేదు. దీంతో కమర్షియల్ హిట్ అందుకోవాలని చూసిన సందీప్ కిషన్ నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. నాగేశ్వర రెడ్డి ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదనేది క్లియార్ గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది. కామెడీ, ఎమోషన్, పాత్రల డిజైనింగ్, అలాగే పాత్రల జస్టిఫికేషన్ సరిగా ఉండదు. కేవలం కమర్షియల్ చట్రంలో సినిమాను ఇరికించేయాలన్న ఆతృతతో సినిమా ఫీల్ దెబ్బ తీసేశారు.
ప్లస్‌లు..
సందీప్‌కిషన్ నటనతో పాటు హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ, ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ, పాటలు, నేపథ్య సంగీతం.. నిర్మాతలు పెట్టిన ఖర్చు… సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
మైనస్‌లు…
పరమ రొటీన్ కథకు రొటీన్ ట్రీట్మెంట్… బోరింగ్ స్క్రీన్ ప్లే… కీలకమైన సెకండాఫ్‌లో తడబడిపోవడం.. క్లైమాక్స్ తేలిపోవడం.
తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ రేటింగ్: 2.5 / 5