బళ్లారి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గాలి సోదరులు ఈప్రాంత రాజకీయాలకు దూరం కావడమే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. 2018 శాసన సభ ఎన్నికలలో చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు నియోజక వర్గం నుంచి బళ్లారి శ్రీరాములు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తరువాత ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బళ్లారి జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా తనను నియమించాలని మంత్రి శ్రీరాములు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పరను కోరినా ఎందుకనో శ్రీరాములును రాయచూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా నియమించారు.
అప్పటి నుంచి బళ్లారి జిల్లాకు శ్రీరాములు దూరం అవుతూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గాలి సోదరుల హవాను కొంత కట్టడి చేసేందుకే బీజేపీ అధిష్ఠానం ఈ చర్యలకు పాల్పడిందనే వాదనా ఉంది. బళ్లారి రాజకీయ వేదికపై చెరగని ముద్ర వేసిన ఇద్దరు సోదరులు ఇప్పుడు ఆ ప్రాంత రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడంతో అనుచరులు ఆందోళనకు లోనవుతున్నా రట. ఇందులో గాలి జనార్ధన్‌రెడ్డి స్వతహాగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటుండగా ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతూ వస్తున్న బళ్లారి శ్రీరాములు కూడా జిల్లా రాజకీయాలకు దూరం కావాల్సి రావడం ఆయన శ్రేణులను తీవ్రంగా బాధిస్తోంది.
శ్రీరాములు నేతృత్వంలోనే పనిచేసేందుకు తమకు ఇష్టమని కొంతమంది నేతలైతే బహిరంగా వేదికలపైనే చెబుతుండటంతో పార్టీలో చీలిక ఏర్పడుతోందని సమాచారం. కర్ణాటకలోని 15 నియోజక వర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఇప్పుడు కాక పుట్టించే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఉప ఎన్నిక జరగబోయే విజయనగర నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి ఆనంద్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయితే ఆయన గెలుపు బాధ్యతలను అధిష్ఠానం శ్రీరాములుకు అప్పగించకపోవడం కూడా జిల్లా రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి వీరిద్దరి మధ్య విభేదాలే శ్రీరాములు అలా వ్యవహరించడానికి కారణమట. విజయనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలను కలుపుకుని ప్రత్యేకంగా విజయనగరం జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆనంద్‌సింగ్ చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి గాలి సోదరులు ససేమిరా అంటుండటం గమనార్హం. ఏదేమైనా ఒకప్పుడు బళ్లారి రాజకీయాలను తమ కనుసైగలతో శాసించిన గాలి సోదరులతో పాటు ఇటు శ్రీరాములు ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాలకు దూరమైపోవడం కన్నడ రాజకీయాల్లో సంచలనంగా మారింది.