పర్యటనలు.. సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు.ఇక, ఈ రోజు ఆర్ అండ్ బీ శాఖపై ఆయన సమీక్ష చేశారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం.. రోడ్ల పరిస్థితిపై ఆరా తీశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదని ..గత ప్రభుత్వ తీరుతో ఇప్పుడెవరూ ముందుకు రావడం లేదని అధికారులు తెలిపారు. గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం అని ఆర్ అండ్ బీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, అత్యవసర పనులకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసే ప్రక్రియ మొదలు పెట్టాలి.. రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర ఉన్న గుంతల సమస్యలకి తక్షణమే మరమ్మతులు ప్రారంభించాలి . మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.