ఎలాన్ మస్క్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ టెస్లా తెలుసు కదా. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లుగా అవి ఉన్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవి కలిగి ఉంటాయి. ఎలక్ట్రిసిటీతో నడుస్తాయి. అయితే ఆ కార్లను త్వరలోనే భారత్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం వివరాలను వెల్లడించారు.
టెస్లా కంపెనీ భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభం నుంచే కార్యకలాపాలను నిర్వహించనుంది. అందులో భాగంగానే టెస్లా మోడల్ 3 కార్లకు గాను బుకింగ్స్‌ను ప్రారంభించనుంది. అయితే బుక్ చేసుకున్న వారికి వచ్చే ఏడాది చివరి వరకు కార్లకు డెలివరీ చేస్తారు. కాగా 2016లోనే టెస్లా కంపెనీ తన కార్లను భారత్‌లో విక్రయించేందుకు సిద్ధమైంది. 1000 డాలర్ల టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. అయితే అప్పట్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఎఫ్‌డీఐ నిబంధనల వల్ల తాము తమ కార్లను భారత్‌లో విక్రయించలేమని టెస్లా తెలిపింది. దీంతో టెస్లా కార్ల బుకింగ్ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది.
అయితే ఎట్టకేలకు మళ్లీ మార్గం సుగమం కావడంతో టెస్లా కంపెనీ తిరిగి భారత్‌లో తన కార్లకు బుకింగ్స్ ను వచ్చే ఏడాది ఆరంభం నుంచి ప్రారంభిస్తుంది. ఇక టెస్లా కంపెనీకి చెందిన కార్ల ధరలు ప్రారంభంలోనే రూ.60 లక్షల వరకు ఉంటాయి. అయితే భారత్‌లో టెస్లా కంపెనీ ఒంటరిగా విక్రయాలను చేపట్టాలని భావిస్తోంది. కస్టమర్ల స్పందనను చూసి భారత్‌లో టెస్లా కార్ల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలని చూస్తున్నారు. మరి టెస్లా కార్లు భారత్‌లో హిట్ అవుతాయో, లేదో చూడాలి.