మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత.. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ట్రస్ట్ చైర్పర్సన్గా ఆమె ఎన్నిక దగ్గరి నుంచి విజయనగరం ట్రస్ట్ వ్యవహారాలన్నీ వివాదాస్పదంగా మారుతున్నాయి.మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతున్నాయి . గతంలో ఆ ట్రస్ట్ టీడీపీ నేత అశోకగజపతిరాజు ఆధీనంలో ఉండేది. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గతంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరోవైపు విజయనగరంలో బలమైన నేత. చంద్రబాబునాయుడుకు అత్యంత నమ్మకస్తుడు.టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
అయితే మాన్సస్ ట్రస్ట్ చైర్మన్గా ఆయన ఉన్న కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. ట్రస్ట్ నిధులను దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం.. పరోక్షంగా జోక్యం చేసుకొని ఆయనను ట్రస్ట్ కార్యకలాపాల నుంచి తప్పించింది.సంచయిత బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు చేపట్టాక ట్రస్ట్ వ్యవహారం ఏపీలోనే హాట్ టాపిక్గా మారాయి. ట్రస్ట్ చైర్మన్గా ఆమె నియామకం కావడాన్ని అశోకగజపతిరాజుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు.
మహారాజ కోటలో ఉన్న మాన్సాస్ కార్యాలయాన్ని విశాఖ జిల్లా పద్మనాభంకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు సంచయిత నిర్ణయంపై మండిపడుతున్నారు. 10 మంది వరకు సిబ్బందిని కూడా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే కార్యాలయం ఆధునీకరణ కోసమే తరలింపని ఈవో చెబుతున్నారు. కాగా ఆందోళనకారుల ప్రతిఘటన నుంచి తప్పించుకోవడానికే కొత్త ఎత్తుగడ అని విమర్శలు వస్తున్నాయి. మహారాజ కోటలోకి మీడియా ప్రవేశం కూడా రద్దు చేశారు. ఈవో అనుమతి ఉంటేనే కోటలోకి అనుమతి అని అధికారులు చెబుతున్నారు.చైర్పర్సన్ సంచయిత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ మెమోలపై సంతకాలు కూడా చేశారు. 1958 లో పీవీజీ రాజు స్థాపించిన మాన్సస్ రెవెన్యూ కార్యాలయం అప్పటి నుండి కోటలోనే కొనసాగుతోంది. అయితే ఈ నిర్ణయంపై గజపతిరాజుల కుటుంబం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
.