తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ప్రభుత్వ ఉపేక్షతో తమ డిమాండ్లు పట్టించుకోవడంలేదని ఆరోపించిన ఆర్టీసీ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) మే 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. మే డే స్పూర్తితో సమ్మెకు సిద్ధమవుతున్నామని వెల్లడించిన జేఏసీ నేతలు, ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఈ పోరాటం ప్రారంభమవుతోందన్నారు.
సమ్మెకు మద్దతుగా మే 5న ఆర్టీసీ యూనిఫారంలో కార్మిక కవాతు నిర్వహించనున్నారు. ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ కవాతు జరగనుందని జేఏసీ తెలిపింది. జేఏసీ నేతలు కొన్ని సంఘాలు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. యూనియన్‌లకు అతీతంగా అన్ని వర్గాలు ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ప్రజా ప్రయోజనాల దృష్టితో పాలన జరగాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ ముప్పును నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేసి నడపాలని సూచించారు. అలాగే 2021 వేతన సవరణ అమలుపరచాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, రిటైర్ అయిన 16 వేల మంది ఉద్యోగుల స్థానాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.