నెల్లూరు టీడీపీ నాయకుడు.. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీకి మూడు దశాబ్దాలుగా సేవలు చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తాజాగా ఎదురైన ఘటన ఆయనకు సవాలుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కావలి పట్టణంలో ఇటీవల కూల్చేసిన ఎన్టీఆర్ విగ్రహ సమస్య సోమిరెడ్డి మెడకు చుట్టుకుంది. కూల్చింది ప్రభుత్వమే అయినా.. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడాల్సిన బాధ్యతను చంద్రబాబు సోమిరెడ్డిపైకి నెట్టేశారు. నువ్వు ఇన్నాళ్లుగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నావు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెట్టలేవా? అని పోన్‌లోనే ఆయన క్లాస్ పీకడంతో సోమిరెడ్డి తలపట్టుకుంటున్నారు. దీంతో ఆయన విగ్రహంపై పోరాటానికి రెడీ అవుతున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ క్రమంలోనే విగ్రహం సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలని, లేదంటే తమ కార్యచరణ తమకుంటుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆ విగ్రహాన్ని తొలగించిన వారిపై, సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవడంతోపాటు, విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ టీడీపీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కావలి సమీపంలోని ముసునూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు దుర్మార్గంగా తొలగించారని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు.
ఆ విగ్రహాన్ని బావిలో పడేసేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకుని ఒకరింటివద్ద భద్రపరిచినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని సీఎం జగన్మోహన్‌రెడ్డి మందలించాల్సింది పోయి, పట్టించుకోకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు ఏంచేస్తే అదే చట్టమా అని ప్రశ్నించారు. విగ్రహ తొలగింపుపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎన్టీఆర్ కుటుంబ అభిమానులందరూ ఉద్యమిస్తారన్నారు.
కానీ, వాస్తవానికి సోమిరెడ్డి ఇంత ఆవేదన వ్యక్తం చేసినా.. జిల్లాలోని టీడీపీ నాయకులు ఆయనతో కలిసి రాకపోవడంతో ఆయన చేసే ఉద్యమం నీరుగారుతుందనే ఆందోళన ఆయనను తీవ్రంగా వేధిస్తోందట. ఇటు జగన్ ప్రబుత్వం తన మాట వినే పరిస్థితి లేదు. మరోపక్క, చంద్రబాబు తన విజ్ఞతకే పరీక్ష పెట్టారు అని సోమిరెడ్డి కుమిలి పోతున్నారట. దీంతో విగ్రహం విషయం సోమిరెడ్డికి సవాలుగా మారిందని అంటున్నారు పరిశీలకులు.