సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. నలుగురు అరెస్టు

-

తెలంగాణలో విషాదం నింపిన సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నలుగురు నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్‌ స్కూటర్ల షోరూంల నిర్వాహకులు, తండ్రీకుమారుడు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ ఉన్నారు.

సెల్లార్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్‌ ఖన్నా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్‌ పోలీస్‌స్టేషన్‌లో 304 పార్ట్‌ 3, 324 ఐపీసీ అండ్‌ సెక్షన్‌ 9 బి ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌ 1884 ప్రకారం కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

లాడ్జి నిర్వాహుకులు ప్రమాదం తర్వాత పరారయ్యారని పోలీసులు తెలిపారు. వీరు కిషన్‌బాగ్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే అగ్నిప్రమాద ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను పూర్తిగా విచారించిన తర్వాత ఘటనకు గల కారణాలు, లోటుపాట్లు అన్నీ వివరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news