వన్యప్రాణులపై క్రూరత్వం కొనసాగుతూనే ఉంది. మొన్న ఏనుగును పైనాఫిల్ ఆశ చూపి, కోతికి సజీవంగా ఉరి వేశారు. నేడు ఉడుముని సజీవంగా కాల్చి తిన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లికి చెందిన వడ్డె రాజు అనే వ్యక్తి మెదక్ లో మూడు నదులు ఒకే చోట, ఏడుపాయల నది పరివాహక ప్రాంతంలోని అడవిలో ఉడుమును పట్టుకున్నాడు. సంచిలో వేసుకుని దారి మధ్యలో ఇద్దరు వ్యక్తులకు రూ.450 లకు అమ్మాడు. ఉడుమును తినాలనే క్రమంలో సజీవంగా కాలుస్తూ వీడియో తీశారు.
కాల్చి తిని ఊరుకోక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇద్దరు. అలా పోస్ట్ చేసిన వీడియో డీజీపీ మహేందర్ కంట పడింది. ఇంకేముంది వీడియోపై స్పందించిన ఆయన మెదక్ జిల్లా అటవీశాఖ అధికారి వనజారాణికి వీడియోను షేర్ చేశారు. అధికారుల విచారణ మొదలుపెట్టారు. ఉడుమును అమ్మిన రాజును పట్టుకుని అరెస్ట్ చేశారు. రాజును విచారించగా.. తను ఉడుమును అమ్మిన వ్యక్తులను గుర్తించలేనని, వాళ్లిద్దరూ మాస్కులు ధరించారని తెలిపాడు. అటవి శాఖ అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు