పెళ్లైన 25 రోజులకై భార్యను చంపి గోనిసంచిలో వేసి పారేసిన భర్త..

-

ప్రేమ, పెళ్లి ఈ రెండింటిలో ఏది చేయాలన్నా ఈరోజుల్లో భయంగానే ఉంది.. అటు ప్రేమించినా సుఖం లేదు.. ఇటు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా సుఖం లేదు.. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో తెలియని పరిస్థితి..వచ్చనివాడు..మొగడు కాదు..కాలయముడని అమాయకపు ఆడపిల్లలు గుర్తించే లోపే జీవితం తెల్లారిపోతుంది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన 25 రోజులకే ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అంతేకాదు భార్య మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఓ నిర్జన ప్రదేశంలో విసిరేశాడు..

అజ్మీర్ జిల్లాలోని క్రిస్టియన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ దంపతులు 26 రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని.. కొత్తగా పెళ్లయిన మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు చెబుతున్నారు. క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్ స్ట్రీట్ నంబర్-4లో నివసించే ముఖేష్ సింధీ (34) నయాబజార్‌లో బట్టల దుకాణం నడుపుతున్నాడు. గత సంవత్సరం ఆగస్టులో ముఖేష్ స్నేహితుడు రమేష్ .. భగవాన్ గంజ్‌లో నివసించే జెన్నిఫర్ (32)ని పరిచయం చేశాడు. ఇద్దరు ప్రేమించుకుని 26 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

ఇదే క్రమంలో.. బుధవారం ఉదయం ముఖేష్‌, జెన్నిఫర్ మధ్య తీవ్ర గొడవ జరిగింది. నన్ను క్షమించండి, ఎప్పుడు అలా చేయను అని జెన్నిఫర్ .. తన భర్తను వేడుకున్నట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అయితే మహిళ వేడుకున్న కొంతసేపటికి ఇంట్లో నుంచి ఎటువంటి శబ్దాలు రాలేదని.. కొంతసేపటికి ముఖేష్ ఇంటి నుంచి .. ఓ గోనె సంచిని తీసుకుని బయటకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. ముఖేష్ ఓ గోనె సంచితో ఇంటి నుంచి బయటకు వచ్చి.. ఆ సంచిని స్కూటీపై ఉంచుతుండగా గొనె సంచి కింద పడింది. అదే సమయంలో పొరుగువారు గోనె సంచిలో మృతదేహాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు జెన్నీ ఫర్‌తో ముఖేష్ గొడవ పడడమే కాదు.. చాలా దారుణంగా కొట్టినట్లు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. తనను వదిలేయమని భర్తను ఆమె వేడుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.. హైలెట్‌ ఏంటంటే..స్థానికులు ఇవన్నీ పూసగుచ్చినట్లు ఇప్పుడు చెప్తున్నారు..అదేదో ఆ గొడవ జరిగేప్పుడు వెళ్లి వాళ్లను ఆపే ప్రయత్నం చేస్తే.. ఆమె బతికేదికదా..! ఇండియాలో చాలామంది..గొడవలను ఎంజాయ్‌ చేస్తారు..శ్రద్ధగా వింటారే తప్ప వెళ్లి ఆపుదాం అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏమంటారు..?

అయితే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళం పగలగొట్టి పరిశీలించగా రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ఇంతలో.. మృతదేహాన్ని బయట పడేసిన ముఖేష్ ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసులను చూసి పారిపోయాడు. అతడిని వెంబడించిన పోలీసులు కలెక్టరేట్ సమీపంలో పట్టుకున్నారు.

పోలీసుల విచారణలో తన భార్యను హత్య చేసి శవాన్ని పుష్కర్ ప్రాంతంలో పడేసినట్లు భర్త ముఖేష్ అంగీకరించాడు..ప్రస్తుతం నిందితుడు ముఖేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జెన్నిఫర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న జెన్నిఫర్ తల్లి ఆమెను పెంచింది. బాధితురాలి సోదరుడు ముఖేష్ కట్నం డిమాండ్ చేస్తున్నాడని ..ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అసలు ముఖేష్‌ భార్యను అంత కిరాతకంగా చంపడానికి కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version