వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, అధికారులపై రైతుల దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ జితెందర్ కు నోటీసులు జారీ చేశారు.
అదేవిధంగా తక్షణ పరిశీలన కోసం తమ అధికారుల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాలని కూడా నిర్ణయించింది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎన్ హెచ్ఆర్ సీ తాజాగా సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది.