తెలంగాణ హైకోర్టుకు ఇటీవల నలుగురు అదనపు న్యాయమూర్తులను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కొత్తగా నియామకమైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకారం చేసిన వారిలో జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు, జస్టిస్ ఇ.తిరుమలదేవి, జస్టిస్ బి.ఆర్.మధుసూదన్‌రావులు ఉన్నారు. కాగా, గతంలో రేణుక యారా సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. ఇక నందికొండ నర్సింగ్‌రావు సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉండేవారు. ఇ.తిరుమలాదేవి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా ఉండగా.. బి.ఆర్.మధుసూదన్‌రావు హైకోర్టు రిజిస్ట్రార్(పరిపాలన)గా బాధ్యతలు చూసేవారు. హైకోర్టులో మొత్తం 42 మంది జడ్జీల అవవసరం ఉండగా. తాజా నియామకాలతో కలిపి ఆ సంఖ్య 30కు చేరింది.