పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కాకపోతే ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే తేడా. సృష్టిలో ఏ ప్రాణికైనా మృత్యువు అనివార్యం. అందుకు మానవులు కూడా అతీతుతు కాదు. అయితే మనుషులు చనిపోయినప్పుడు ఆయా వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, విశ్వాసాల ప్రకారం మృతదేహాలను ఖననం చేస్తారు. కొందరు దహనం చేస్తారు. ప్రధానంగా హిందువులు చనిపోయిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన తరువాతే దహనం చేస్తారు. ఈ అంతిమ సంస్కారాలనే అంత్యేష్టి అని కూడా అంటారు. అందులో పలు కార్యక్రమాలు ఉంటాయి. మృతదేహానికి స్నానం చేయించడం, అలంకరించడం, శవయాత్ర చేయడం, దహనం ఇలా ఆ క్రియలు కొనసాగుతాయి.
అయితే వీటన్నింటి కన్నా ముందు వ్యక్తి చనిపోగానే అతని కాలి బొటన వేళ్లను రెండింటినీ చిన్నపాటి తాడుతో కలిపి కట్టేస్తారు. అనంతరం దహనం జరిగే వరకు ఆ తాడు అలాగే ఉంటుంది. దహనంలో మృతదేహంతోపాటు కాలిపోతుంది. అయితే అలా తాడు లేదా తీగ వంటి దాంతో కాలి బొటన వేళ్లను ఎందుకు కట్టేస్తారో తెలుసా..? మనిషి చనిపోయాక అతనికి శ్రాద్ధ కర్మలు చేసే వరకు అతని ఆత్మ ఈ లోకంలోనే తిరుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. దీని గురించి దాదాపుగా అందరికీ తెలుసు. అయితే అలా తిరిగే ఆత్మ తన ఇంట్లోకి మళ్లీ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వ్యక్తి చనిపోయాక అతని కాలి బొటన వేళ్లను తీగతో కట్టేయడం జరుగుతుంది.
దీంతో కాళ్లు కదలవు కాబట్టి ఆత్మ మళ్లీ ఇంట్లోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదు. దీనికి తోడు చనిపోయిన వ్యక్తి కాళ్లు దూరంగా పోకుండా ఒక్క దగ్గరే బిగుతుగా ఉండడం కోసం కూడా కాలి బొటన వేళ్లను అలా కట్టేస్తారు. అదీ అసలు సంగతి! చనిపోయిన తర్వాత మనిషి శరీరం బిగుసుకుపోతుంది. ఈ క్రమంలో కాళ్లు విడువడే అవకాశముంది. అందుకే..కాళ్ల బొటన వేళ్లను అలా తాడుతో కట్టేస్తారు.!