ఏ వ్యక్తిలోనైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లడానికి కారణాలు.. మీరూ ఇలాగే ఉంటున్నారా?

-

మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఏ పనీ మొదలు పెట్టలేరు. పూర్తి చేయలేరు. ఏదైనా చేద్దామనుకున్నప్పుడు మీ వల్ల కాదేమోనన్న అనుమానం వచ్చి అది పెద్దదై మీ వల్ల కాదు అన్న ఫీలింగ్ ని తెప్పిస్తుంది. దానివల్ల మీరు చేయాలనుకున్న వాటిని పూర్తి చేయలేకపోతారు. ఇలా మీ మీద నమ్మకం పోవడానికి బయట పరిస్థితులు కారణం అవుతాయి. ఆ పరిస్థితులేంటో తెలుసుకుని, మీరు కూడా ఇతరుల పట్ల అలా ఉంటున్నారా? లేదా మీ పట్ల ఎవరైనా అలా ఉండి మీలో విశ్వాసాన్ని తగ్గిస్తున్నారేమో చెక్ చేసుకోండి.

తల్లిదండ్రుల నిర్లక్ష్యం

ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. ఆ సమయంలో వారి నిర్లక్ష్యం పిల్లల్లో ఆత్మన్యూనత భావానికి దారి తీస్తుంది. ఏదైనా చెప్పడానికి, లేదా వినడానికి ఎవరో ఒకరు లేకపోతే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.

తల్లిదండ్రుల అంగీకారం ఎప్పుడూ దొరక్కపోవడం

ఏదైనా చేద్దామనుకుంటే వద్దని, దానివల్ల నష్టాలు వస్తాయని పదే పదే చెబుతూ ఉండడం వల్ల కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఏది చెప్పినా నా వల్ల కాదంటున్నారనే ఫీలింగ్, నా వల్ల నిజంగానే ఏదీ కాదనే విశ్వాసం పెరుగుతుంది. అందుకే కొన్ని కొన్ని సార్లు నష్టం వస్తుందని తెలిసినా పిల్లలకే వదిలివేయడం మంచిది.

అభద్రతాభావం

సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే భావనలు వాళ్ళలో నేనలా లేనే భావం పెరిగి పెరిగి అభద్రతాభవానికి లోనవుతారు. దాంతో ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింటుంది.

యాంగ్జాయిటీ, ఒత్తిడి

అనేక ఒత్తిడుల కారణంగా యాంగ్జయిటీకి లోనై అది మనసు మీద ప్రభావం చూపి ఆత్మవిశ్వాసాన్ని దూరం చేస్తుంది. ఈ ఒత్తిడుల వల్లే చాలామంది తాము చేయాలనుకున్నది చేయలేకపోతున్నారు.

చెడుస్నేహాలు

మీతో కలిసి తిరిగే స్నేహాలు సరిగ్గా లేనపుడు మీరు నెగెటివ్ గా మారిపోతారు. అందుకే పాజిటివ్ స్నేహితుల సమక్షంలో ఉండడం ఎప్పటికైనా మంచిది.

మిమ్మల్ని మీరు తిట్టుకోవడం

నేనిలా చేస్తున్నానేంటి? ఇలా ఎందుకు మారిపోయాను? నా వల్ల ఏమీ కాదు. నేను చేతకాని వాడిని వంటి మాటలు మీకు మీరే మాట్లాడుకోవడం వల్ల మిమ్మల్ని మీరు చేతకానివాడిలా ఒప్పేసుకుంటున్నట్టు అయిపోతుంది.

పోలిక

ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం. ఎవరికి వాళ్ళే ఎక్కువ. మీరేం తక్కువ కాదు అన్న విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version